బలగం, కోర్ట్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న ప్రియదర్శి మరోసారి లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమా గతంలోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
సినిమా ప్రమోషన్ సమయంలో వచ్చిన పాజిటివ్ బజ్‌తో అత్యధిక స్క్రీన్స్‌లో రిలీజ్ చేశారు. ఈ సమ్మర్‌కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సారంగపాణి జాతకం ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
సారంగపాణి(ప్రియదర్శి)కి జాతకాలంటే అతి నమ్మకం. ప్రేమించిన విషయాన్ని కూడా మంచి రోజు చూసుకుని, జాతకం ప్రకారం చెప్పాలని అనుకుంటాడు. కార్ల షో రూంలో సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ చేసే ప్రియదర్శి అక్కడే జాబ్ చేసే మైథిలీ (రూప కొడువాయిర్) ప్రేమలో పడుతాడు. ఇద్దరి ప్రేమకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పెళ్లి కి ముందు అనుకోకుండా హస్త సాముద్రికులు అయిన జిగేశ్వరానంద(అవసరాల శ్రీనివాస్)ను సారంగపాణి కలుస్తాడు. ఆ సమయంలోనే సారంగపాణి జాతకం చూసిన జిగేశ్వరానంద షాకింగ్ విషయాన్ని చెప్తాడు. నీ జాతకంలో హత్య చేసే దోషం ఉందని చెప్తాడు.
దాంతో పెళ్లికి ముందే ఆ హత్య ఏదో చేసి, పెళ్లి తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని సారంగపాణి అనుకుంటాడు. అందుకోసం పెళ్లిని వాయిదా వేసుకుంటాడు. స్నేహితుడు చందు(వెన్నెల కిషోర్)తో కలిసి సారంగపాణి ఒక వ్యక్తిని హత్య చేసేందుకు ప్లాన్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? చివరకు సారంగపాణి హత్య చేస్తాడా? కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.
నటీనటుల నటన :
కామెడీ పాత్రల్లో ఉత్తమ నటన కనబర్చడంలో ప్రియదర్శి ఎప్పుడూ ముందు ఉంటాడు. జాతకాల పిచ్చొడు అయిన సారంగపాణి పాత్రలో ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. అతడి నటనకు అంతా ఫిదా అవుతారు. కామెడీ సీన్స్‌లో ప్రియదర్శి నటన బాగుంది. కన్ఫ్యూజ్, కంగారు, ప్రేమ... ఇలా అన్ని ఎమోషన్స్‌లోనూ నవ్వు తెప్పించాడు. బలగం, కోర్ట్ సినిమాలతో పోల్చితే మరింత మెచ్యూరిటీగా ప్రియదర్శి ఈ సినిమాలో సారంగపాణి పాత్రలో కనిపించాడు.
హీరోయిన్ రూప కొడువాయిర్ కి పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. ఉన్నంతలో అందంతో అలరించింది. సారంగపాణి కన్ఫ్యూజన్, అతడి అమాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ సాగే మైథిలీ పాత్రలో ఈమె కనిపించింది. ఓవరాల్‌గా పర్వాలేదు అన్నట్లుగా ఈమె నటించి మెప్పించింది. అందం విషయంలో ఎలాంటి లోపం లేదు. పాటలు, కొన్ని లవ్ సీన్స్‌లో మెప్పించింది. జాతకాలు చెప్పే వ్యక్తిగా అవసరాల శ్రీనివాస్ ఆకట్టుకున్నాడు. లుక్ నుంచి మొదలుకుని యాస వరకు అన్ని విధాలుగా ఆకట్టుకున్నాడు. ఇక వెన్నెల కిషోర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రియదర్శితో కలిసి మెజార్టీ సన్నివేశాల్లో కామెడీతో మెప్పించాడు. తనికెళ్ల భరణి తన పాత్రకు న్యాయం చేసే విధంగా నటించాడు.
టెక్నికల్ :
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఎంపిక చేసుకున్న కథ పూర్తి స్థాయి వినోదాత్మకంగా సాగే విధంగా ఉంది. స్క్రీన్‌ప్లేతో మరింతగా నవ్వించే సీన్స్‌ను జొప్పించే అవకాశాలు ఉన్నాయి. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ వంటి స్టార్ కమెడియన్స్ ఉండటంతో సహజంగానే కామెడీ సీన్స్ పై అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే సీన్స్ ఉన్నాయి.
సంగీతం గురించి ఎక్కువగా చెప్పుకోవడానికి లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో బీజీఎం ఉందా లేదా అన్నట్లుగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పలు సన్నివేశాలను మరింత వినోదాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా సినిమాటోగ్రపీ పని చేసింది. డైలాగ్స్ నవ్వించాయి. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
విశ్లేషణ :
కామెడీ సినిమాలకు ఎప్పుడూ మంచి స్పందన లభిస్తోంది. ఎంత పెద్ద స్టార్ అయినా కామెడీతో మెప్పించగలడు. కామెడీ ట్రై చేస్తే, అది ఆరోగ్యదాయకంగా ఉంటే తప్పకుండా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమా కూడా మంచి వినోదాత్మకంగా ఉంది. జాతకాలను అతిగా నమ్మడం వల్ల జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని కామెడీగా చెప్పే ప్రయత్నం చేశారు.
ఏదైనా కొంత మేరకు పర్వాలేదు. కానీ ఎక్కువగా దేన్నీ నమ్మకూడదు. ఆ విషయం గురించి ఈ సినిమాలో చక్కగా చూపించారు. మంచి జీవితాన్ని అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల నాశనం చేసుకుంటూ ఉంటారు. సారంగపాణి వంటి వారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వారందరికీ కనువిప్పు అన్నట్లుగా ఈ సినిమా మెసేజ్‌ను ఇవ్వడంతో పాటు మంచి వినోదాన్ని సైతం ఇస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
కామెడీ సీన్స్,
ప్రియదర్శి, వెన్నెల కిషోర్.
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ సీన్స్,
కథలో స్ట్రాంగ్ పాయింట్ లేకపోవడం,
సంగీతం.
చివరగా...
నవ్విస్తూనే మంచి మెసేజ్ ఇచ్చారు.
బ్యానర్ : శ్రీదేవీ మూవీస్ బ్యానర్
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్
దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ
సంగీతం : వివేక్ సాగర్
తారాగణం : ప్రియదర్శి, రూప కొడువాయిర్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి తదితరులు