నితిన్ ఈమధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌ను చవిచూస్తూ వస్తున్నాడు. చాలా నమ్మకం పెట్టుకుని చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. దాంతో తనకు హిట్ ఇచ్చిన భీష్మ దర్శకుడు వెంకీ కుడుములతో రాబిన్‌హుడ్ టైటిల్‌తో ఈ సినిమాను చేశాడు. పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
అనాధ అయిన రామ్ అలియాస్ రాబిన్ హుడ్ (నితిన్) చిన్నప్పటి నుంచే తోటి అనాథలకు తిండి పెట్టడం కోసం, చదివించడం కోసం దొంగతనాలు మొదలు పెడతాడు. దేశంలోని ఎన్నో అనాధ ఆశ్రమాలకు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాడు. దొంగతనాలు చేస్తుండే రాబిన్‌హుడ్ అనుకోకుండా రుద్రకొండ అనే గ్రామానికి వెళ్లాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా నుంచి ఆ గ్రామానికి వచ్చిన నీరా(శ్రీలీలా)ను కాపాడే బాధ్యత తీసుకుంటాడు. ఆ గ్రామం మొత్తాన్ని కాపాడుతాడు.
ఇంతకు రామ్ కి ఆ గ్రామానికి సంబంధం ఏంటి? ఇంతకు నీరా ఆ గ్రామానికి ఎందుకు వెళ్తుంది? అనేది సినిమా కథ.
నటీనటుల నటన :
నితిన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్‌లో నితిన్ బెస్ట్ అని మరోసారి నిరూపితం అయింది. యాక్షన్ సన్నివేశాల్లోనూ మెప్పించాడు. కానీ పాటల్లో నితిన్ పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. నితిన్ గత చిత్రాల్లో మాదిరిగానే కనిపించడంతో పాటు, యాక్టింగ్‌లోనూ పెద్దగా తేడా కనిపించలేదు. నితిన్ లుక్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఈ సినిమా కోసం నితిన్ కాస్త ఎక్కువగానే కష్టపడ్డాడు. కానీ పెద్దగా ప్రయోజనం కనిపించలేదు.
శ్రీలీల మరోసారి క్యూట్ గర్ల్ పాత్రలో నటించింది. కథ మొత్తం ఆమె చెట్టూ తిరుగుతూ ఉంటుంది. అమాయకురాలు అయిన అమ్మాయి పాత్రలో శ్రీలీల పర్వాలేదు అనిపించింది. కానీ నటిగా ఆమె ఇంకాస్త బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. డాన్సర్‌గా ఆమె మరోసారి తన సత్తా చాటింది. వెన్నెల కిషోర్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. అతడి అమాయకత్వంతో నవ్వించే ప్రయత్నం చేశాడు. కొన్ని సీన్స్‌లో పర్వాలేదు కానీ ఓవరాల్‌గా ఆయన పాత్రను దర్శకుడు సరిగ్గా డిజైన్ చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ కి రొటీన్ పాత్ర దక్కింది. ఇలాంటి పాత్రల్లో ఆయన గతంలో నటించాడు. కనుక మరోసారి మెప్పించాడు. డేవిడ్ వార్నర్ ఉన్నంతలో లుక్‌తో మెప్పించాడు.
టెక్నికల్ :
దర్శకుడు వెంకీ కుడుముల కథ విషయంలో ఇంకాస్త వర్క్ చేయాల్సిందే. ఆకట్టుకునే స్క్రీన్ ప్లేను నడిపించడంలో విఫలం అయ్యాడు. మెయిన్ స్టోరీ లైన్ విషయంలో అతడి ఆలోచన మెచ్చుకోవచ్చు. కానీ దాన్ని డెవలప్ చేయడంలో మాత్రం విఫలం అయ్యాడు. ఇలాంటి పేలవమైన స్క్రీన్ ప్లేతో కష్టమే. దర్శకత్వంలోనూ విఫలం అయ్యాడు.
సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ పర్వాలేదు అనిపించాడు. కొన్ని సీన్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. యాక్షన్ సన్నివేశాలను రియలిస్టిక్‌గా చూపించడంలో సినిమాటోగ్రపీ విఫలం అయింది. ఎడిటింగ్‌లో లోపాలు ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.
విశ్లేషణ :
వెంకీ కుడుముల సినిమా అంటే ప్రేక్షకులు వినోదాన్ని ఆశిస్తున్నారు. ఈ సినిమా సైతం వినోదాత్మకంగా నడిపించాలని దర్శకుడు ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం కొంత మేరకే సఫలం అయింది. ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్ విషయంలో అనుకున్నట్లు నడిపించాడు.
కానీ సెకండ్ హాఫ్ లో కామెడీ సీన్స్ పండలేదు. సెకండ్ హాఫ్‌లోనూ కామెడీ పర్వాలేదు అన్నట్లుగా ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఆకట్టుకునే కథ కాకపోవడంతో పాటు, స్క్రీన్ ప్లేలో ఆసక్తికర ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల నిరాశ తప్పదు. కామెడీతో సీరియస్ కథను ముందుకు తీసుకు వెళ్లడం ఈ మధ్య కాలంలో కనిపిస్తున్న ట్రెండ్. అయితే రొటీన్ కామెడీతో దర్శకుడు వెంకీ కుడుముల ఆకట్టుకోలేకపోయాడు.
నితిన్, శ్రీలీల మధ్య రొమాన్స్‌ను చూపించలేదు. అసలు ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉన్నట్లే అనిపించలేదు. సినిమా కథను చాలా ట్విస్ట్‌లు చేసి చూపించాడు. ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి.
ప్లస్‌పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్‌లోని కొన్ని కామెడీ సీన్స్,
నితిన్ ప్రజెన్స్.
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్,
రొటీన్ కామెడీ,
స్క్రీన్ ప్లే,
ఎడిటింగ్.
చివరగా...
రాబిన్‌హుడ్‌కు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంలో నిరాశే.
బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్
నిర్మాత : నవీన్ యెర్నేని, రవి శంకర్
దర్శకత్వం : వెంకీ కుడుముల
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
తారాగణం : నితిన్, శ్రీలీల, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, కేతిక శర్మ, డేవిడ్ వార్నర్ తదితరులు