'ఓజీ' రివ్యూ... ఫ్యాన్స్‌కి పైసా వసూల్‌ మూవీ

Movie Review
2.5/5
'ఓజీ' రివ్యూ... ఫ్యాన్స్‌కి పైసా వసూల్‌ మూవీ

Our Rating

2.5/5
2.5
out of 5

పవన్‌ కళ్యాణ్‌ ను ఫ్యాన్స్ ఎలా చూడాలని ఆశ పడుతున్నారో అలా చూపించాను అంటూ దర్శకుడు సుజీత్‌ చేసిన ప్రకటన సినిమాపై అంచనాలు భారీగా పెంచింది. అంతే కాకుండా విభిన్నమైన ప్రమోషన్స్‌, పవన్‌ కళ్యాణ్‌ లుక్‌ ఓజీ పై అంచనాలు భారీగా పెంచిన విషయం తెల్సిందే. రికార్డ్‌ స్థాయి అడ్వాన్స్ బుకింగ్‌ నమోదు చేసిన ఓజీ సినిమా అభిమానులు ఆశించిన రేంజ్‌లో ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

జపాన్‌ నుంచి కొన్ని పరిస్థితుల కారణంగా ముంబై వస్తాడు ఓజాస్‌ గంభీర(పవన్ కళ్యాణ్‌). ఆ వచ్చే ప్రయాణంలో సత్య దాదా(ప్రకాష్‌ రాజ్‌)కి చాలా పెద్ద సాయం చేస్తాడు. దాంతో ముంబైలో ఓజాస్‌ గంభీరను ఉపయోగించుకుని సత్య దాదా పెద్ద వ్యాపార సామ్రాజ్యంను ఏర్పాటు చేస్తాడు. కొన్నాళ్ల తర్వాత కొన్ని కారణాల వల్ల సత్య దాదాను వదిలి గంభీర దూరంగా వెళ్లి పోతాడు. సత్య దాదాకి చెందిన పోర్ట్‌ను ఓమి భావు(ఇమ్రాన్‌ హస్మి) ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడంతో పాటు, సత్యదాదాను చంపేందుకు సిద్ధం అవుతాడు. దాంతో మళ్లీ గంభీర రంగంలోకి దిగుతాడు.

సత్య దాదాను గంభీర ఎలా కాపాడుతాడు? అసలు గంభీర జపాన్‌ నుంచి ఎందుకు వస్తాడు? ఈ గ్యాంగ్‌ వార్‌లో చివరికి పై చేయి సాధించింది ఎవరు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన :

ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ లుక్ విషయంలో దర్శకుడు సుజీత్‌ చాలా శ్రద్ద పెట్టినట్లుగా అనిపించింది. అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫ్యాన్స్‌ పవన్‌ లుక్‌ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారు. రెగ్యులర్‌గా ఉండే లుక్‌ కాకుండా విభిన్నంగా కనిపించాడు. పీరియాడిక్‌ నేపథ్యం కావడంతో పాటు, గ్యాంగ్‌స్టర్ నేపథ్యం కావడం వల్ల పవన్‌ కళ్యాణ్‌ ను కొత్తగా చూడగలిగాం. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టాడు. తాను గన్‌ పడితే ఎలా ఉంటుందో పవన్‌ కళ్యాన్‌ మరోసారి చూపించాడు. ఓవరాల్‌గా ఫ్యాన్స్ కోసం పవన్‌ ఈ సినిమాలో చాలా కష్టపడ్డాడు అనడంలో నూటికి నూరు శాతం నిజం.

హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌ పాత్ర నిడివి తక్కువగానే ఉంది. ఆమె పాత్రను మధ్యలోనే ముగించారు. ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది. ప్రకాష్ రాజ్ పాత్రకు కథలో మంచి వెయిట్‌ ఉంది. ఇలాంటి పాత్రలు పడ్డప్పుడు ఆయన ప్రాణం పెట్టి నటిస్తాడు అంటారు. అన్నట్లుగానే ఆయన చాలా చక్కగా సినిమా కథను ముందుకు నడిపించడంలో తన నటనతో మెప్పించాడు. ఇమ్రాన్‌ హస్మి సైతం తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అయితే హీరో పాత్ర ముందు అన్ని పాత్రలు కూడా తేలిపోయాయి. హీరోకు ఇచ్చిన ఎలివేషన్ మరే పాత్రకు లేదు. అందుకే ఇతరుల నటన గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

టెక్నికల్‌ :

ఓజీ సినిమా సాంకేతిక బాధ్యత పూర్తిగా తమన్‌ తన భుజాలపై వేసుకున్నాడు అనడంలో సందేహం లేదు. దర్శకుడు సుజీత్‌ ఎలా అయితే ఫ్యాన్‌ బాయ్ మూమెంట్‌తో సినిమాను తీశాడో, అలాగే తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. కేవలం తమన్‌ సంగీతం వల్ల ఫస్ట్‌ హాఫ్‌ రేంజ్‌ రెండు మూడు రెట్లు పెరిగింది అనడంలో సందేహం లేదు. ఆయన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కి ఫ్యాన్స్ పిచెక్కి పోయారు. పవన్‌ ఫ్యాన్స్‌ కి హై తీసుకు వచ్చేందుకు తమన్‌ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ బద్దలు అయింది. సినిమా మొత్తంలోనూ తమన్‌ మ్యూజిక్‌ ఫ్యాన్స్‌కి హై తీసుకు వచ్చింది.

సినిమాటోగ్రఫీ సైతం బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో పవన్‌ కళ్యాణ్‌ను చూపించిన తీరుకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ పవన్‌ కళ్యాణ్‌ లోని అన్ని యాంగిల్స్ బ్యూటీని సినిమాటోగ్రాఫర్ ఆవిష్కరించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దర్శకుడు సుజీత్‌ తన దర్శకత్వం, స్క్రీన్‌ ప్లేతో మెప్పించాడు. అయితే కథ విషయంలో ఇంకాస్త వర్క్ చేయాల్సి ఉంది. ఎడిటింగ్‌ లో చిన్న చిన్న లోపాలు మినహా పెద్దగా ఇబ్బంది లేదు. నిర్మాణాత్మక విలువలు టాప్‌ నాచ్‌లో ఉన్నాయి.

విశ్లేషణ :

పవన్‌ కళ్యాణ్‌ చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా వారికి పూర్తి స్థాయి సంతృప్తిని ఇచ్చే విధంగా ఉంది. పవన్‌ కళ్యాణ్‌ ను వెండి తెరపై చూసిన సమయంలో వారు పొందే అనుభూతి ఈ సినిమాతో రెట్టింపు పొందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్‌ ను స్క్రీన్‌ పై పవర్‌ హౌస్‌లా చూపిస్తున్న సమయంలో బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆ విజువల్స్ స్థాయిని పెంచేశాయి. తమన్‌ అందించిన సంగీతం ఫస్ట్‌ హాఫ్ లోని పవన్‌ ఇంట్రడక్షన్‌ సీన్ తో పాటు, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ సీన్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యేలా ఉంది. పవన్‌ కనిపించిన ప్రతి సారి తమన్‌ రెచ్చి పోయాడు అనిపించింది. అయితే దర్శకుడు సుజీత్‌ కథ విషయంలో ఇంకాస్త వర్క్ చేయాల్సింది. అంతే కాకుండా పవన్‌ ఎలివేషన్స్‌ కాకుండా స్క్రీన్‌ ప్లే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.

సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. కానీ వారందరి పాత్రలు తేలి పోయే విధంగా కేవలం పవన్‌ కళ్యాణ్ పాత్రను మాత్రమే ప్రతి సీన్‌లో హైలైట్‌ చేయడం జరిగింది. పవన్‌ పై తనకు ఉన్న అభిమానంతో ఈ సినిమాను తీసిన సుజీత్‌ అనుకున్నట్లుగానే ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విధంగా సీన్స్‌ను రాసుకున్నాడు, తీశాడు. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ చూడాలంటే కాస్త ఆలోచించాల్సిందే. సినిమాకు ఏ సర్టిఫికెట్‌ ఇచ్చిన విషయం తెల్సిందే. రక్తపాతం ఏ స్థాయిలో ఉందో సెన్సార్‌ సర్టిఫికెట్‌ ను చూస్తే అర్థం అవుతుంది.

పవన్‌ కళ్యాణ్‌ పై అభిమానంతో గంభీర పాత్రను సుజీత్‌ అద్భుతంగా డిజైన్ చేశాడు, కానీ ఇతర విషయాల పట్ల ఆయన పూర్తి స్థాయిలో సక్సెస్‌ కాలేదని చెప్పక తప్పదు. పవన్‌ ఫ్యాన్స్ కి ఇది ఫుల్‌ మీల్స్‌. మరి ఇతర సినీ గోయర్స్‌కి ఎలా ఎక్కుతుంది అనేది చూడాలి.

ప్లస్‌ పాయింట్స్ :

పవన్‌ కళ్యాణ్‌,

తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌,

యాక్షన్‌ సీన్స్‌,

హీరో ఎలివేషన్స్‌

మైనస్ పాయింట్స్ :

శృతి మించిన యాక్షన్‌,

వీక్‌ స్టోరీ,

హీరో కాకుండా ఇతర పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడం,

ఎమోషనల్‌ కనెక్షన్స్‌ లేదు,

క్లైమాక్స్‌

చివరగా...

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కోసం ఈ ఓజాస్‌ గంభీర.

బ్యానర్ : డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌

నిర్మాత : డివివి దానయ్య

దర్శకత్వం : సాహో సుజీత్‌

సంగీతం : తమన్‌

తారాగణం : పవన్‌ కళ్యాణ్‌, ప్రియాంక అరుల్‌ మోహన్‌, ప్రకాష్ రాజ్‌, ఇమ్రాన్‌ హస్మీ, శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌ తదితరులు