హ్యాపీడేస్ వంటి విభిన్నమైన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాలను రూపొందించిన శేఖర్ కమ్ముల మెల్ల మెల్లగా తన రూటు మార్చుకుంటూ వస్తున్నాడు. చివరగా ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి అంతకు మించిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, విభిన్నమైన పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించాడు. ధనుష్‌ను ఈ సినిమాలో బిచ్చగాడిగా చూపించాడు. దానికి తోడు ఈ సినిమాలో నాగార్జున ముఖ్య పాత్రలో నటించడంతో అంచనాలు పెరిగాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
అనాధ అయిన దేవ(ధనుష్) బిచ్చగాడిగా జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. అలాంటి దేవ అనూహ్య పరిస్థితుల్లో లక్షల కోట్లకు అధిపతిగా మారుతాడు. అందుకు తెర వెనుక పెద్ద కుట్ర దాగి ఉంటుంది. నీరజ్ మిశ్రా అనే పెద్ద వ్యాపారవేత్త దేశంలోని అతి పెద్ద చమురు నిల్వలను దక్కించుకోవడం కోసం దేవాతో పాటు మరికొందరు బిచ్చగాలను ఎంపిక చేసుకుంటాడు. ఆ నలుగురిలో దేవ రివర్స్ కావడంతో నీరజ్ మిశ్రా షాక్ అవుతాడు. ఈ కుంబకోణంలో నీరజ్ మిశ్రాకు దీపక్(నాగార్జున) సాయం చేస్తాడు. మాజీ సీబీఐ అధికారి అయిన దీపక్ కొన్ని కారణాల వల్ల జైల్లో ఉంటాడు. జైలు నుంచి బయటకు రావడం కోసం ఆ కుట్రకు సాయం చేస్తాడు.
ఇంతకు ఆ కుట్ర ఏంటి? దేవ ఏమయ్యాడు? దేశ సంపదను దక్కించుకోవడం కోసం నీరజ్ మిశ్రా చేసిన ప్రయత్నం సఫలం అయ్యిందా? అనేది వెండి తెరపై చూడాల్సిందే.
నటీనటుల నటన :
ధనుష్ నటన గురించి ఎప్పుడూ విమర్శలు రావు. ఆయన ఏ పాత్ర పోషించినా కూడా అందుకు తగ్గట్లుగా ఉంటాడు. ఈ సినిమాలో బిచ్చగాడిగా కనిపించిన సమయంలో సర్‌ప్రైజ్ చేశాడు. ఒక స్టార్ హీరో ఇలా కూడా నటిస్తాడా, ఇలా కూడా కనిపించేందుకు ఒప్పుకుంటాడా అనిపించింది. ధనుష్ ఈ సినిమా కోసం బరువు తగ్గాను అన్నాడు. నిజంగానే తన గత చిత్రాల లుక్‌తో పోల్చితే పాత్రకు తగ్గట్లుగా బరువు తగ్గినట్లు అనిపించాడు. ధనుష్ లుక్ మాత్రమే కాకుండా ఆయన నటన సినిమాకు ప్రధన ఆకర్షణ. సినిమా కథ మొత్తం తన భుజాలపై వేసుకుని మోసిన ఘనత ఈయనకు దక్కింది. అన్ని రకాల ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించడంలో సక్సెస్ అయ్యాడు.
రష్మిక మందన్న పాత్ర స్క్రీన్ ప్రజెన్స్ తక్కువగా ఉంది. అయినా కూడా ఉన్నంతలో ఆకట్టుకుంది. ఈమె ఈ మధ్య కాలంలో నటన పరంగా చాలా మెచ్యూర్డ్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ఎమోషన్ సీన్స్‌లో మెప్పించింది. ఆకట్టుకునే అందంతో పాటు, పాత్రకు తగ్గ లుక్‌తో రష్మిక మందన్న మెప్పించింది. కేవలం గ్లామర్ డాల్ పాత్రలకు మాత్రమే కాకుండా ఇలాంటి పాత్రలతోనూ మెప్పిస్తాను అని రష్మిక చెప్పకనే చెప్పింది.
ఇక నాగార్జున పాత్ర చాలా భిన్నంగా ఉంది. ఇలాంటి పాత్రలో నాగార్జున కనిపించడం మనం అరుదుగా చూస్తూ ఉంటాం. నాగార్జున అభిమానులు కాకుండా సగటు ప్రేక్షకులు సైతం నాగ్ నటనను, ఆయన లుక్‌ను కచ్చితంగా అభినందించే విధంగా ఉంది. ఇతర పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.
టెక్నికల్ :
శేఖర్ కమ్ముల దర్శకత్వం చాలా విభిన్నంగా ఉంటుంది. ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మార్క్ ఎక్కడ మిస్ కాకుండా, పొలిటికల్ డ్రామాను చక్కగా ముందుకు తీసుకు వెళ్లాడు, ఆ కట్టుకునే స్క్రీన్‌ప్లే కథను నడిపించాడు.
దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంది. అయితే ఆయన పాటలు ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మెప్పించింది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. కొన్ని సీన్స్‌లో చాలా సహజంగా సీన్స్ ఉన్నాయి. ఎడిటింగ్‌లో లోపాలు ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. కొన్ని టచ్చింగ్ డైలాగ్స్ ఉన్నాయి.
విశ్లేషణ :
దర్శకుడు శేఖర్ కమ్ముల మంచి పాయింట్ తీసుకుని ఈ సినిమాను రూపొందించాడు. అందుకు తగ్గట్లుగా స్క్రీన్ ప్లే నడిపించాడు. ఈ మధ్య కాలంలో ఇలాంటి పొలిటికల్ డ్రామాలు, క్రైమ్ థ్రిల్లర్‌లు చాలానే వచ్చాయి. కానీ ఈ సినిమాలో కథను నడిపించిన తీరు బాగుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి మెసేజ్‌ను మంచిగా చూపించడంలో శేఖర్ కమ్ముల సఫలం అయ్యాడు.
సినిమాకి హోల్ అండ్ సోల్ ధనుష్ అనడంలో సందేహం లేదు. ఇలాంటి ఓ పాత్రకు ధనుష్ వంటి హీరోలు తప్ప మరెవ్వరూ ఒప్పుకోరు. ఇక నాగార్జునను సైతం చక్కగా శేఖర్ కమ్ముల వినియోగించుకున్నాడు. మొత్తానికి కమర్షియల్ సినిమాలు తీస్తున్న శేఖర్ కమ్ముల మరో అడుగు ముందుకు వేసి మరీ ఈ సినిమాను తీసినట్లుగా అనిపించింది. నాగార్జున, ధనుష్ అభిమానులు మాత్రమే కాకుండా పొలిటికల్ డ్రామాలను ఇష్టపడే వారు ఈ సినిమాను చూడవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
ధనుష్ యాక్టింగ్,
శేఖర్ కమ్ముల దర్శకత్వం,
విలన్ పాత్ర.
మైనస్ పాయింట్స్ :
ఎమోషన్ సీన్స్,
ఎడిటింగ్,
మ్యూజిక్
చివరగా...
శేఖర్ కమ్ముల మార్క్ కమర్షియల్ పొలిటికల్ డ్రామా ఆకట్టుకుంది.
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్
నిర్మాత : సునీల్ నారంగ్
దర్శకత్వం : శేఖర్ కమ్ముల
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
తారాగణం : ధనుష్, రష్మిక మందన్న, నాగార్జున, దలీప్ తహిల్, జిమ్ సర్భ్ తదితరులు