'జెర్సీ' వంటి కల్ట్ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించిన గౌతమ్ తిన్ననూరి కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుని చేసిన సినిమా 'కింగ్డమ్'. వరుస ఫ్లాప్‌ల్లో ఉన్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా అత్యంత కీలకం అయింది. గత చిత్రం ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో విజయ్ దేవరకొండ కాస్త లో గా ఉన్నాడు.
ఇలాంటి సమయంలో గౌతమ్ తిన్ననూరి వంటి స్టార్ ఫిల్మ్ మేకర్ దర్శకత్వంలో సినిమాను చేస్తుండటంతో అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. గత ఏడాది కాలంగా ఈ సినిమా గురించి రౌడీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంది? ఫ్యాన్స్ అంచనాలు అందుకుందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సూరి(విజయ్ దేవరకొండ) చిన్నతనంలోనే కొన్ని కారణాల వల్ల ఇల్లు వదిలి వెళ్లిన అన్న శివ(సత్యదేవ్) కోసం వెతుకుతూ ఉంటాడు. తన డ్యూటీ చేస్తూనే అన్న కోసం అన్వేషణ సాగిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఒక గొడవ కారణంగా సూరి విషయం పై ఆఫీసర్‌ల వరకు వెళ్తుంది. కానిస్టేబుల్ సూరిపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా, ఆ సమయంలోనే శ్రీలంకలో ఉన్న పెద్ద స్మగ్లర్ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు గాను గూఢచారిగా సూరిని పంపిస్తారు.
అక్కడ తన అన్న ఉన్నాడనే విషయం తెలిసి వెళ్లిన సూరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఇంతకు ఆ స్మగ్లింగ్ గ్యాంగ్‌తో సూరి అన్న శివకు ఉన్న సంబంధం ఏంటి? తన అన్నను అక్కడ నుంచి ఎలా బయటకు తీసుకు వచ్చాడు? అనేది సినిమా కథాంశం.
నటీనటుల నటన :
విజయ్ దేవరకొండ తన నటనతో మెప్పించాడు. రెండు విభిన్నమైన వేరియేషన్స్‌తో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంది. ఆవేశపరుడైన కానిస్టేబుల్ సూరి పాత్రలో నటించి మెప్పించిన విజయ్ దేవరకొండ, అదే సమయంలో అన్నయ్య శివ కోసం తాపత్రయ పడే సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. యాక్షన్ సన్నివేశాల్లో ఎప్పుడూ విజయ్ దేవరకొండ ఆకట్టుకుంటాడు అని మరోసారి ఈ సినిమాతో నిరూపితం అయింది. ఎమోషన్ సీన్స్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది. లవ్ ట్రాక్ పెద్దగా లేదు, కనుక రొమాంటిక్ సీన్స్‌లో నటించేందుకు విజయ్ దేవరకొండకు ఈ సినిమాలో స్కోప్ దక్కలేదు.
హీరోయిన్‌గా నటించిన భాగ్య శ్రీ బోర్సే కి మరోసారి కూరలో కరివేపాకు పాత్ర లభించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎందుకు ఉంది, ఎలా ఉంది అనేది పెద్దగా పట్టింపు లేదు. హీరోయిన్ ఉండాలి కనుక ఆమె ఉంది అన్నట్లుగానే ఉంది. కథ లో ఆమె పాత్ర లేదు, ఆమెకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఉన్నంతలో పర్వాలేదు అనిపించిన భాగ్యశ్రీ కి ఈ సినిమా పెద్దగా ప్రయోజనం చేకూర్చేదిగా మాత్రం కనిపించడం లేదు. ఇతర పాత్రల్లో నటించిన సత్యదేవ్, వెంకటేష్‌లు ఆకట్టుకున్నారు. వీరిద్దరూ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. విజయ్ దేవరకొండ తో సమానంగా వీరిద్దరికి స్క్రీన్ ప్రజెన్స్ దక్కింది. అందుకు తగ్గట్లుగా ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రల్లో నటించిన వారు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నారు.
టెక్నికల్ :
కింగ్డమ్ సినిమాకు మెయిన్ టెక్నికల్ హైలైట్ అనిరుధ్ సంగీతం అనడంలో సందేహం లేదు. తమిళ్‌తో పాటు తెలుగులో ప్రస్తుతం అనిరుధ్ సౌండ్ మారుమ్రోగుతోంది. అందుకే ఈ సినిమాకు అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు అనగానే అంచనాలు, ఆసక్తి పెరిగాయి. విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం ప్రాణం పోస్తుందని, అతడి రీ రికార్డింగ్‌తో సినిమా స్థాయి పెరిగి పోతుందనే విశ్వాసంను వ్యక్తం చేశాడు. అన్నట్లుగానే చాలా సన్నివేశాల్లో అనిరుధ్ వాయింపు మామూలుగా లేదు. ఆయన బీజీఎంతో చాలా సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎమోషన్ లేని సీన్స్‌లోనూ బీజీఎంతో ఎమోషన్ ఫీల్ కలిపించాడు.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన మార్క్ ఎమోషన్‌ను ఈ సినిమాలో చూపించలేక పోయాడు. యాక్షన్ పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఎమోషన్స్‌ను మరచినట్లు అయింది. సినిమాలో ప్రేక్షకులను కట్టిపడేసేది ఎమోషన్స్ అనడంలో సందేహం లేదు. అలాంటి ఎమోషన్స్‌ను దర్శకుడు గౌతమ్ క్యారీ చేయడంలో విఫలం అయ్యాడు. గౌతమ్ తిన్ననూరి కథ ఎంపిక విషయంలోనూ నిరుత్సాహపరిచాడు. స్క్రీన్ ప్లే కాస్త పర్వాలేదు అనిపించింది. ఎడిటింగ్ లో లోపాలున్నాయి. కొన్ని సన్నివేశాల విషయంలో ఎడిటర్ మరింతగా కత్తెర పెట్టినా బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. పీరియాడిక్ మూవీ కావడంతో అందుకు తగ్గట్లుగానే విజువల్స్‌ను చూపించడంలో సినిమాటోగ్రాఫర్ పనితనం బాగుంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
విశ్లేషణ :
జెర్సీ వంటి ఎమోషన్స్‌తో కింగ్డమ్ ఉంటుందని మొదటి నుంచి యూనిట్ సభ్యులు చెబుతూ వచ్చారు. బ్రదర్స్ ఎమోషన్‌తో సినిమా ఉంటుందని ప్రమోషన్స్‌లో పేర్కొన్నారు. కానీ సినిమాలో ఎమోషన్స్ ఆ స్థాయిలో లేవని చెప్పాలి. యాక్షన్ పై పెట్టిన శ్రద్ద ఎమోషన్స్ చూపించడంలో పెట్టలేదు అనిపించింది. కథ లైన్ మరీ థిన్‌గా ఉంది. సింపుల్ కథను తీసుకుని స్క్రీన్ ప్లేతో నడిపించే ప్రయత్నం చేశాడు. స్క్రీన్ ప్లే పర్వాలేదు అన్నట్లుగా ఉంది.
విజయ్ దేవరకొండ మార్క్ యాక్షన్‌తో పాటు, ఆయన మేనరిజం వల్ల సినిమా కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉంది. అయితే పెంచిన అంచనాలకు తగ్గట్లుగా మాత్రం సినిమా లేదని, అంతే కాకుండా గౌతమ్ తిన్ననూరి మార్క్ ఎమోషన్, ఆయన మార్క్ సీన్స్ లేవని చెప్పక తప్పదు. సినిమాను నిలబెట్టిన ఎలిమెంట్స్‌లో అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం ఒకటి.
హీరోయిన్‌కి ఏమాత్రం ప్రాముఖ్యత లేకపోవడం బాధాకరం. హీరో సింగిల్‌గా ఈ సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు. అప్పుడప్పుడు సత్యదేవ్, వెంకటేష్ పాత్రలు ఆకట్టుకున్నా పూర్తి స్థాయిలో మెప్పించలేక పోయాయి. రౌడీ ఫ్యాన్స్ కి మోస్తరు ఎంటర్‌టైన్మెంట్‌ను అందించే విధంగా కింగ్డమ్ ఉంది.
ప్లస్ పాయింట్స్ :
బ్యాక్ గ్రౌండ్ స్కోర్,
స్క్రీన్ ప్లే,
విజయ్ దేవరకొండ, సత్యదేవ్ నటన
మైనస్ పాయింట్స్ :
కథ,
ఎమోషన్స్ మిస్ అయ్యాయి,
హీరోయిన్‌కి ప్రాముఖ్యత లేకపోవడం,
ఎడిటింగ్.
చివరగా..
రౌడీ స్టార్ మాస్ యాక్షన్ ఓకే, తిన్ననూరి ఎమోషన్ మిస్
బ్యానర్ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత : నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్
తారాగణం : విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ, మహేష్ తదితరులు