'అఖండ 2' రివ్యూ... ఫ్యాన్స్‌కి పూనకాలు

Movie Review
2.25/5
'అఖండ 2' రివ్యూ... ఫ్యాన్స్‌కి పూనకాలు

Our Rating

2.25/5
2.25
out of 5

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబో మూవీ అనగానే ఫ్యాన్స్‌కి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆసక్తి ఉండటం చాలా సహజం. ఎందుకంటే వీరి కాంబోలో ఇప్పటికే సింహా, లెజెండ్‌, అఖండ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. మూడు సినిమాలు సూపర్‌ హిట్‌ కావడంతో పాటు, అఖండకు సీక్వెల్‌గా రూపొందిన సినిమా కావడంతో అఖండ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆ అంచనాలకు ఈ సినిమా తగ్గట్లుగా ఉందా? ఈ కాంబోలో నాల్గవ హిట్‌ నమోదు అయిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

సైనిక చర్య ద్వారా ఇండియాపై విజయాన్ని సొంతం చేసుకోలేక పోయిన శత్రు దేశంకు చెందిన దుర్మార్ఘులు కుట్రపూరితంగా ప్రవర్తించి, ఇండియాలోనే ఉంటూ అధికారం కోసం ఎంతకైనా తెగించే రాజకీయ నాయకుడి సహాయంతో వినాశనంకు ప్లాన్‌ చేస్తారు. అందుకు మహాకుంభమేళను ఎంపిక చేసుకుంటారు. వేలాది మంది ప్రాణాలు తీసేందుకు ఒక వైరస్‌ను క్రియేట్‌ చేస్తారు. దాంతో ఇండియా మొత్తం అల్లకల్లోలం అవుతుంది.

ఆ వైరస్‌కి వెంటనే వ్యాక్సిన్‌ను కనిపెట్టిన భారత శాస్త్రవేత్తలు దాన్ని జనాలకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో మరోసారి శత్రుదేశంకు చెందిన వారు దాడి చేస్తారు.

ఆ సమయంలో అఖండ(బాలకృష్ణ) ఆ వ్యాక్సిన్‌ను ఎలా రక్షించాడు? అసలు అఖండ ఏం చేస్తున్నాడు అనేది సినిమా కథాంశం.

నటీనటుల నటన :

నందమూరి బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా అఖండ పాత్రలో బాలయ్య లుక్ కి ఫ్యాన్స్ మతి పోవడం ఖాయం. గతంలోనే ఆయన అఖండ పాత్రలో అఘోరగా నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఎక్కువ నిడివి ఉన్న పాత్రలో కనిపించాడు. బాలకృష్ణ అటువంటి గెటప్‌ లో కనిపించడమే గొప్ప విషయం అంటే, ఆ లుక్‌ తో చేసిన యాక్షన్‌ సీన్స్ నెవ్వర్‌ బిఫోర్‌ అన్నట్లుగా సాగాయి. మరో పాత్రలో ఫ్యామిలీ మ్యాన్‌ గా బాలకృష్ణ ఆకట్టుకున్నాడు. మొత్తంగా బాలకృష్ణ వన్‌మ్యాన్‌ షో అన్నట్లుగా నడిపించాడు.

హీరోయిన్‌ సంయుక్త మీనన్‌ ఒక్క పాటకే పరిమితం అయింది. ఒక యాక్షన్‌ సన్నివేశంలోనూ ఆమె కనిపించింది. అయితే ఆమె పాత్ర నిడివి కొంత మేరకు ఉండటం జరిగింది. అయితే ఉన్నంతలో గ్లామర్‌ తో అలరించింది. సినిమాలో మొదటి నుంచి కూడా హర్షాలి పాత్ర గురించి ప్రముఖంగా చెబుతూ వచ్చారు. అన్నట్లుగానే ఈ సినిమాలో ఆమె పాత్రకు వెయిట్‌ ఉంది. అయితే ఆమె స్క్రీన్‌ ప్రజెన్స్ ఎక్కువ సమయం ఏమీ లేదు. ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది.

ఆది పినిశెట్టి విలన్‌గా ఆకట్టుకున్నాడు. సెకండ్‌ హాఫ్‌ లో వచ్చే అతడు క్రూరమైన మాయావిగా కనిపించి మెప్పించాడు. ఇతర పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల పరిధిలో పర్వాలేదు అనిపించారు.

టెక్నికల్‌ :

అఖండ సినిమా పేరు ఎత్తగానే ప్రతి ఒక్కరికీ ఆ సినిమా కోసం తమన్‌ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుర్తుకు వస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకే అఖండ 2 సినిమాలో తమన్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమా విడుదలకు ముందే టీజర్‌, గ్లిమ్స్‌, ట్రైలర్‌ లో తమన్‌ తన మ్యూజిక్‌ తో హైప్‌ క్రియేట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. అంతే కాకుండా ఒక పాటతోనూ మెప్పించాడు. బాలకృష్ణ మాస్ ఇమేజ్‌ కి తగ్గట్లుగా తమన్ బీజీఎం ఇవ్వడంతో సినిమా స్థాయి పెరిగింది. యాక్షన్ సన్నివేశాల్లో తమన్‌ మ్యూజిక్‌ కుర్చీ అంచున కూర్చోబెట్టింది అనడంలో సందేహం లేదు.

దర్శకుడు బోయపాటి శ్రీను ఈసారి కథ విషయంలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ద పెట్టాల్సింది అనిపించింది. అఖండ 2 సినిమా కథ విషయంలో అసంతృప్తిగా ఉంది. ఇక స్క్రీన్‌ ప్లే విషయంలోనూ చాలా లోపాలు ఉన్నాయి. కథ చిన్న లైన్‌తోనే ఉన్నప్పటికీ స్క్రీన్‌ ప్లేను అందుకు తగ్గట్లుగా ఆకట్టుకునే విధంగా నడిపించాల్సిన అవసరం ఉంది. కానీ దర్శకుడు ఆ దిశగా కథను నడిపించడంలో విఫలం అయ్యాడు. వీఎఫ్‌ఎక్స్‌ మరీ పేలవంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని హిమాలయ షాట్స్ ను చక్కగా చూపించారు. నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా బాగున్నాయి.

విశ్లేషణ :

అనుకోని అవాంతరం కారణంగా ఆలస్యం అయిన అఖండ 2 సినిమా విషయంలో అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు మొదటి నుంచి పాజిటివ్‌ హోప్‌ ను కలిగి ఉన్నారు. ఎప్పుడైతే అవాంతరాలు రావడం మొదలైందో అప్పటి నుంచే సినిమా పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఫలితం విషయంలో ఈసారి ఏమైనా తేడా కొట్టేనా అన్నట్లుగా కొందరు మాట్లాడుతూ వచ్చారు. అదే జరిగింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అభిమానులు బాలకృష్ణ కోసం అఖండ 2 సినిమాను చూసి ఎంజాయ్‌ చేయవచ్చు. కానీ రెగ్యులర్‌ ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఆనందించే ఎలిమెంట్స్ ఎక్కువగా లేవని చెప్పాలి. కథను సరిగ్గా చెప్పక పోవడంతో పాటు, స్క్రీన్‌ ప్లే విషయంలో నిరుత్సాహ పరిచారు.

తమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ బాగున్నా అందుకు తగ్గట్లుగా యాక్షన్ సీన్స్ పండలేదు. బాలయ్య యాక్షన్ సీన్స్ ను ఆయన అభిమానులు ఎంజాయ్‌ చేస్తారు, కానీ ఆయన మార్క్ డ్రామా, ఎమోషన్‌ సీన్స్ లేకపోవడంతో రెగ్యులర్‌ ప్రేక్షకులు బోర్‌ ఫీల్‌ అయ్యే అవకాశం ఉంది. ఒకటి రెండు సీన్స్ మినహా రెగ్యులర్‌ ఆడియన్స్ ను కట్టి పడేసే సీన్స్ లేవని చెప్పక తప్పదు. మరి థియేట్రికల్‌ రన్‌ లో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందా అనేది చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

బాలకృష్ణ,

తమన్ సంగీతం.

కొన్ని యాక్షన్‌ సీన్స్‌.

మైనస్ పాయింట్స్ :

కథ, కథనం,

ఎమోషన్‌ లేకపోవడం,

ఓవర్‌ స్టంట్స్‌.

చివరగా...

అఖండ 2 అభిమానుల వరకు మాత్రమే..!

బ్యానర్ : 14 రీల్స్‌ ప్లస్‌

నిర్మాత : రామ్ ఆచంట, గోపీ ఆచంట

దర్శకత్వం : బోయపాటి శ్రీను

సంగీతం : తమన్‌

తారాగణం : బాలకృష్ణ, సంయుక్త మీనన్‌, హర్షాలి మల్హోత్ర, ఆది పినిశెట్టి, పూర్ణ, అయ్యప్ప పి శర్మ తదితరులు